Posts Tagged ‘over confidence’

నేను ఎప్పటిలాగే ఆ రోజు కూడా తరగతి ముగియగానే పని చేసుకుందామని ల్యాబు కు వచ్చేసాను. ల్యాబు తలుపు తెరవగానే నాకు ఎప్పుడూ పాఠాలు అర్ధం చేసుకోవడంలో సహాయపడే వరుణ్ (caption: ఊరోడు) ఆ రోజు అప్పటికే ల్యాబ్ లో ఉండటం ఆశ్చర్యానందాలు కలిగించింది. కొంచెం తల పంకించి చూద్దును కదా, వాడితోపాటు మరికొంతమంది (అనుకోని, అవసరంలేని) సహవిద్యార్ధులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళలో ఎప్పుడెప్పుడు నాస్తిక సమావేశం మొదలు పెడదామా అని ఆలోచించే నరేంద్ర, వాడితో అయిందానికీ కానిదానికీ కయ్యానికి దిగే బాబాయి, వీళ్ళిద్దరి కయ్యాన్నీ పెద్దది చేసి అందరినీ involve చేసే దాదా, బొంత కాకి అరిచినట్లు నవ్వే గణేశు, వాడికి company గా సినిమాలలో రాక్షసుడి లాగ నవ్వే సత్తి, అర్ధం కాకపోయినా ఆలోచించి, అర్ధం కాకుండా మాట్లాడే హైదర్ మొదలగు వారు ఉండటం కంగారు కలిగించింది.

వీళ్ళందరినీ చూస్తూనే నా మనసులో చిన్నగా దిగులు మొదలైంది. అసలే కష్టమైన ప్రాజెక్ట్ ప్రెజెంటేషనులు దగ్గర పడుతున్న ఈ సమయంలో వీళ్ళు గ్రూపు స్టడీ అంటూ ఎప్పుడూ (బుద్ధిగా పని చేసుకునే నేనూ, రెడ్డన్నా తప్ప) ఖాళీగా ఉండే ల్యాబును ఆక్రమించడం ఏ విపరీతాలకు దారి తీస్తుందోనని మనసు దిగులు చెందసాగింది. ఇలాంటి భయంతోనే బిక్కుబిక్కు మంటూ పని చేసుకుంటున్న రెడ్డన్నా నేనూ మొహమొహాలు చూసుకుని మా అసహాయతకు పెదవి విరిచి నిట్టూర్చుకున్నాము. నేను కూడా భయంతో వణుకుతూనే నా సిస్టం ముందు కూర్చుని మెయిలు చూసుకోవడం మొదలెట్టాను. ల్యాబంతా కటిక నిశ్శబ్దం రాజ్యమేలింది. ప్రశాంతంగా ఉన్న సమయాన్ని కాస్తా మెయిలు చూసుకోవడం అనే ముఖ్యమైన కార్యక్రమానికి వినియోగిడ్డామనుకున్నాను. ఒక పావుగంటలో నా మెయిలు పని ముగించి నా మనసు అనవసరంగా భయపడిందని నన్ను నేను సమాధానపరుచుకున్నాక చదువు అనే చిన్న కార్యక్రమమం మీద పడదామని నిశ్చయించుకున్నా.

ప్రొఫెసరు చిరు చెప్పిన చిరు వాక్యాలను సైతం అపురూపమైన విజ్ఞాన కళికలుగా రాసుకున్న నా అపురూపమైన Mod-Sim notes ని బయటకు తీసి ఎక్కడలేని ఏకాగ్రతనూ తెచ్చుకుని నా notes లోకి చూడటం మొదలెట్టాను, ప్రాజెక్టు సొల్యూషను కోసం. అంతంతమాత్రమైన నా ఏకాగ్రతతో రెండు పేజీలైనా చదివానో లేదో మొదలైంది ఒక కర్ణ కంటకమైన శబ్దం. అతి కష్టం మీద అప్పుడే అదుపులోకి వస్తున్న నా మెదడు లోని ఆలోచనలనే గుర్రాలు ఆ శబ్దం వింటూనే పెద్దపులి తరుముకొస్తున్నట్లు మళ్ళీ తలో దిక్కుకూ పారిపోయాయి. పక్కనే రాత్రి తెల్లారేదాకా పని చేసిన అలసటతో కునికిపాట్లు పడుతున్న నరేంద్ర కూడా పిడుగు పాతానికి బెదిరినట్లుగా ఉలిక్కిపడి లేచి అయోమయంగా దిక్కులు చూస్తున్నాడు. అప్పుడే బ్రౌజర్లో ఏదో క్లిక్ చేసిన హైదర్ తను తప్పుగా క్లిక్ చేసినందుకే ఈ సౌండ్ వస్తోందని కన్ఫ్యూజ్ అయ్యి కంప్యూటర్ డబ్బాకి నాలుగు వైపులా చూడటం మొదలు పెట్టాడు.

తదేకమైన ఏకాగ్రత తో “దీపిక పడుకునే” బొమ్మలని “కూర్చునే” చూస్తున్న సత్తి, ఆ సౌండ్ వింటూనే network admin లు ల్యాబులో “సరుకు” డౌన్లోడ్ కి ఏదో అలారం పెట్టినట్లున్నారని గుండె చేత్తో పట్టుకుని భయంతో టక్కున అన్ని windows ని హడావిడిగా minimize చేసాడు. హమ్మయ్య అని స్క్రీన్ వైపు చూసిన సత్తికి వాల్ పేపర్ చూసి మళ్ళీ గుండె గుభేలుమంది. స్క్రీన్ మీద మాంచి సెక్సీ పోజులో ఉన్న “కంగనా రనౌట్”ని, అది చూసి “ఆలౌట్” అవ్వబోతున్న తననీ ఇప్పుడు ఎవరైనా చూస్తే తను “డకౌట్” అయ్యి కాలేజీ నుండి పోతానని గ్రహించి ఏమీ ఎరగనట్లు మొహం పెట్టి “ఆర్కుట్” ఓపెన్ చేసాడు (అంతే కాని వాల్ పేపర్ మాత్రం మార్చలేదు!!).

చెదిరిపోయిన ఏకాగ్రతను “థూ! నీ అవ్వ” అని మనసులో నిందిస్తున్న నాకు అదే సౌండు బయట వేరే గొంతుకలో వినపడటంతో అటుగా చూసి ఆ సమయంలో అస్సలు ఊహించని రెండు పరిణామాలని చూసి నిర్ఘాంతపోయాను – మొదటిది, ల్యాబులో గోల చేస్తారనుకున్న వాళ్ళందరూ బుద్ధిగా చదువుకుంటుంటే చదువుకు హెల్ప్ చేస్తాడనుకుంటున్న ఊరోడు గోల చేయడం. ఇంతవరకూ మా వీనులలో విస్ఫోటనాలు చేస్తున్న శబ్దం మరేవిటో కాదు – మా ఊరోడు వాడి రూపాయి-పావలా ల్యాప్టాప్ లో రెహ్మాన్ పాటలు full volume పెట్టి ఆ పాటల మైకంలో తన్మయత్వం చెందుతూ పని చేసుకుంటున్నాడు. అసలే అది పనికిమాలిన ల్యాప్టాపు. దానికి తోడు ఫుల్ వాల్యూము. ఆపై పరీక్ష టెన్షను. ఈ టెన్షను చాలదన్నట్లు ఈ రెండో విషయం ఒకటి – ఊరోడి మీద ఒకడు పరుష పదజాలం ప్రయోగించడం.

అసలు ఊరోడంటే మామూలు వ్యక్తి కాదు. ఏదో ముక్కునపట్టిన కోచింగులతో అత్తీసరిగా IISc లో అడుగుపెట్టిన మన తెలుగు వారందరికీ కాదనకుండా, విసుక్కోకుండా వాడు తీసుకొని సుబ్జేక్ట్లు సైతం పాఠాలు చెప్పి, మేము కూడా ప్యాసు అవ్వగాలమనే భావనను కలిగించే ఆశాకిరణం. (తెలుగు వారిలో) క్లాసు టాపరు. కేవలం చదువు వరకే కాదు, సెలవుల్లో ఏ టూరో organize చేయాలన్నా, బయటకు వెళ్లి షాపింగ్ చేస్తే బేరం ఆడాలన్నా అన్నిటికీ “అతనొక్కడే” – ఊరోడు. ఆ విధంగా మా తరగతిలో విద్యార్ధులందరూ ఊరోడిని ఎంతో అపురూపంగా చూసుకుంటాము.

ఇందాక నాతో కోరస్ కలిపి “థూ! నీ అవ్వ.” అన్నది మరెవరో కాదు – మొహమాటం అనే పదానికి అర్ధం తెలియని కల్లు మామ. దాని తర్వాత వెంటనే “గవేం పాటల్ రా బై..” అని ఊరోడిని ఉద్దేశించి అన్నాడు. ఆ పదం ఊరోడిని ఉద్దేశించబడినది అని తెలియగానే నా రక్తం మరగడం మొదలయ్యింది. ఎంత disturb చేస్తే మాత్రం అంత మాట అనేస్తాడా అని అనుకునేంత లోపే “కొంచం మంచి పాడల్ పెట్టరా బాయ్…?” అన్నాడు. అప్పుడు అర్ధం అయింది అందరికీ వాడిది వాడికెంతో ఇష్టమైన త్రిష పాట పెట్టనందుకు వచ్చిన కోపమని… కాని మా అసలు సమస్య అలాగే ఉండిపోయింది. అందరికీ ఈ గోల ఇబ్బందిగా ఉందో లేదో కూడా క్లియర్ గా అందరికీ తెలియలేదు.

ఏదో ఒకలాగా అందరం ఊరోడి సరదాకి (గోలకి) అలవాటు పది పనిలో పడ్డాము. సౌండు తనది కాదని తెలుసుకున్న హైదర్ (అది ఆగిపోవడానికి) అదేపనిగా క్లోజ్ బటన్ మీద క్లిక్ చేస్తూ బుర్ర పాడుచేసుకోవడం ఆపి, “అసలు… వాడు పాటలు పెడితే నా క్లోజ్ బటన్ పని చేయట్లేదేమని” మళ్లీ ఆలోచనలో పడ్డాడు. నరేంద్ర మళ్ళీ నిద్ర మత్తులో జోగడం మొదలెట్టాడు. సత్తి మళ్ళీ మొహం చాటంత చేసుకుని క్లోజ్ చేసిన దానికన్నా త్వరగా కొన్ని windows open చేసాడు.

పోనీలే! పాటే కదా అని సరిపెట్టుకుని పనులకుపక్రమించాము అందరమూ మళ్లీ. కానీ ఆ బృహద్కార్యం అంతటితో ఆగలేదు. అసలే “అది యశ్వంతపూరులో నుండి పట్టాలు తప్పిన రైలింజను కూత కాదు – పాట” అని అర్ధం చేసుకోవడానికే మాకు కొంత సమయం పట్టింది. ఆ తరువాత ఊరోడి తన్మయత్వం తట్టుకోవడం మా పనయ్యింది. కొద్దో గొప్పో మా తొట్టి గ్యాంగ్లో గాయకుడంటే ఊరోడే! వాడికి అర్జెంటుగా వాడి లలిత కళలను సాధన చేయాలనిపించడం మా పూర్వజన్మ సుకృతం. ఇక మొదలయ్యింది చూడు నా సామి రంగ – రెచ్చిపోయి వాడి విశ్వరూపం చూపడం మొదలెట్టాడు ఊరోడు. రెహ్మాన్ తమిళ్ లో చేసి హిందీ లోకి డబ్ ఐన పాటల్లో high pitch పాటలని మాత్రమే వాడి playlist లోకి ఎంచుకుని వాటితో పాటే పాడటం మొదలెట్టాడు.

ఇంతలో playlist లో తరువాతి పాటయిన వందేమాతరం పాట ఇవేవీ పట్టించుకోకుండా మొదలయ్యింది. ఊరోడి తన్మయత్వం కూడా తారా స్థాయికి చేరింది. ఆ తన్మయత్వంలో వాడు ఈ ప్రపంచాన్ని మరిచి “మా” అని (అరవడం) పాడటం మొదలెట్టాడు. ఇంక Presentation కోసం తంటాలు పడుతున్న వారి తంటాలు చెప్పనలవి కావు. ఎక్కడ తప్పు చేస్తానో అని మొదలే భయం భయం గా లెక్కలు చేస్తున్న సతీష్ గాడు latex లో equation లు రాస్తూ \mu అని రాయాల్సింది పోయి \maaaaaaaa అని రాసేసి (“చిత్రం” సినిమాలో పిల్లాడికి కుక్క గుర్తుకువచ్చినట్లు) అమ్మని గుర్తుకి తెచ్చుకోవడంతో ఇప్పుడిప్పుడే ఊరుకుంటున్న వాడి మనసు మళ్లీ ఇంటికి పోవాలంటూ గోల చేయడం మొదలెట్టింది. ఫలితంగా లెక్క మొదటి నించీ మళ్ళీ చేయాల్సి వచ్చింది. దాదా గాడు ఈనాడు పేపర్ మీద పెట్టిన చర్చ లోంచి అప్పుడే బయటపడి పని చేద్దామనుకుంటున్న రెడ్డన్న ఈ సౌండు విని “7G బృందావన్ కాలనీ” లో నిద్ర చెడిపోయిన సుమన్ శెట్టిలా ఆశ్చర్యమూ, ఏడుపూ, నవ్వూ కాని ఒక వింత expression పెట్టి “ఇంత దారుణంగా ఎలా ఉంటార్రా మనుషులు?” అన్నట్లు ఒక చేయి వాడి వైపు పెట్టాడు. ఇక నించి ఊరోడు గొంతు చించుకునే తంతు రివాజుగా మారింది.

ఈ గోలకి విసుగు చెందిన హైదర్ భాయి తన సహజ మొహమాట పంధాలో “వాడి ఇంగిత జ్ఞానానికి appeal అయ్యేలా ఏదో ఒకటి చేయాలి” అంటూ అద్భతమైన ఐడియా తట్టిన వాడిలా మొహం పెట్టి ప్లాన్-A ను సత్తికి చెప్పాడు. ఈ ఇద్దరు మిత్రులతో కూడిన “intelligent committee” ప్లాను-A ని అమలు జరపడానికి హైదర్ భాయినే సరైన వ్యక్తిగా గుర్తించారు. ఆ తరువాత కొంత సేపటికి అందరూ ల్యాబులో ఉండగా (ఊరోడు మళ్లీ పాటలు పెట్టి తన్మయత్వం లో మునిగి ఉన్నాడని వేరే చెప్పక్కర్లేదు), భాయి ప్లాన్ ని అమలు జరపడం మొదలెట్టాడు.

హైదర్: వరుణ్ మామ్! ఈ పాటల disturbance లో ఎలా చాడువుకున్తున్నావు మామ్?
“ఈ దెబ్బకి వీడికి పాటలు disturbance అన్న విషయం అర్ధం ఔతుంది” అని వాడి ముందు చూపుకి వాడే మురిసిపోయాడు. ల్యాబులో కూర్చుని వింటున్న వారు కూడ ఆశతో చూడ్డటం మొదలెట్టారు. వీడు అక్కడితో ఆగితే బాగుండేది. కాని తర్వాత ఊరోడిని రెచ్చగొట్టే ఇంకొక వాక్యం ఆ థింకింగ్ లోనించి పుట్టిన involvement లో బయటకి రాలి పడిపోయింది.
హైదర్: నీకు చిన్నప్పటినించీ ఇలా చదువుకోవడమే అలవాటా? అసలు ఇలా చదువుకుంటూనే గేటు రాంక్ కొట్టావా?
అప్పటిదాకా హైదర్ గాడు కుమ్మేసాడని ఆనందపడుతున్న మిత్ర బృందం కాస్తా మూకుమ్మడిగా తలలు గోడకేసి బాదుకున్నారు ఆ పదం విని. ఇక ఈ దెబ్బకి ఊరోడు వాడి జీవిత చరిత్రలో “విద్యాభ్యాసం-లలిత కళల పట్ల అభిరుచులు” అనే అంకాన్ని “అహ నా పెళ్ళంట” సినిమాలో నూతన్ ప్రసాదు “మా తాతలు ముగ్గురు” అన్న ఛందాన హైదర్ భైకి విశదీకరించడం మొదలు పెట్టాడు. ప్లాను-A ఫ్లాపయ్యింది.
తరువాత బాబాయి గాడి పౌరుషం రొటీన్ గా తారా స్థాయిని చేరింది. వాడికి చిన్నప్పుడు అడవిలో అగ్గి ఆపాలంటే రెండో వైపు నించి నిప్పు పెట్టాలి అనే సత్యం జ్ఞప్తికి వచ్చి, హైదర్ భాయి యొక్క ఇంగిత తృష్ణలో ఆరని చిచ్చును ఇదే విధంగా ఆర్పాలని (పౌరుషంగా) నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన “HP laptop” ను బయటకు తీసి ఇంగ్లీషు పాటలు పెట్టాడు. అందులో, ఊరోడికి అత్యంత irritation ను రుచి చూపించాలని (స్వీట్ పాన్ లో ఉప్పు వెయ్యమని అడిగే tasteful ఫెలో) అభిరామ దగ్గర తీసుకున్న పాటలు ఫుల్లు వాల్యూముతో పెట్టాడు.
“ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు” అన్న సామెత పని చేయడం అందరూ కళ్ళారా చూసారు. బాబాయితో వివాదం పెట్టుకోకుండానే ఊరోడు వాడి దుకాణం మూసేసాడు. గెలిచానన్న ఉత్సాహంతో అభినందనల కోసం అందరి వైపూ చూస్తున్న బాబాయి కి మిశ్రమ ఫలితం కనిపించింది. హైదర్, సాయి అభినందనాత్మక మైన చూపులతో చూస్తుంటే, నరేంద్ర మొదలగు వారు చాలామంది గుర్రు గా చూడటం మొదలెట్టారు. ఇక కల్లు మామ అయితే ఆ పాటలు భరించలేక “శీను వాసంతి లక్ష్మి” సినిమా లో ఆర్.పి.పట్నాయక్ లాగ గుడ్లు తేలేసి “శివ పుత్రుడు” సినిమా లో విక్రం లాగ మూతి వొంకరగా తిప్పడంతో బాబాయి అసలు విషయం గ్రహించాడు. ప్లాన్-B విజయవంతమైనా, “ఆపరేషన్ సక్సెస్! పేషెంట్ డెడ్” అన్న ఛందాన రహ్మాన్ పాటలు మూయించి అభిరామ పాటలు వినాల్సిన పరిస్దితి వచ్చింది.

ప్లాన్-B విజయం సంగతేమో కాని, రోజంతా అభిరామ ఇచ్చిన playlist లో పాటలు వింటూ జనాలు నీరుకారిపోవడం మొదలెట్టారు. జీవితం మీద ఆశ నశించి ఇక సౌండ్ క్వాలిటీ అధ్వానంగా ఉన్నా కూడ ఊరోడే మేలని నిర్ణయించుకున్నారు. బాబాయిని hurt చేసి వాడి చేత దుకాణం మూయించారు. అంతేకాదు, వాడి ల్యాప్టాపులో మళ్ళీ పాటలు పెడితే ల్యాబు సభ్యత్వం రద్దు చేస్తామని వార్నింగ్ కూడ ఇచ్చారు. బాబాయి పుణ్యమా అని అందరికీ పాటల వల్ల ఇబ్బంది ఉందన్న విషయం అందరికీ తెలిసింది.

ఇంతలో ఊరోడి పరవశం కొత్త పుంతలు తొక్కడం ప్రారంభించింది. ఒక రోజు మెస్ నించి ల్యాబుకు సైకిలు లేదని అందరినీ తనతో నడిపించుకోస్తున్న సత్తి తో: “ఇవాళ మీ అందరికీ చదువుకోడానికి ఎంకరేజ్మెంటుగా కొత్త పాటలోచ్!! కొత్తగా శంకర్ మహదేవన్ పాటలు డౌన్లోడ్ చేశా” అని భయపెట్టాడు. ఆ దెబ్బకి ఊరోడు వెళ్లిపోయాడని నిర్ధారించుకున్నాక గాని మెస్ కి వెళ్ళడం మానేసాడు సత్తి.

మరొక రోజు ల్యాబ్ లో అందరమూ పిచ్చా పాటి మాట్లాడుకునే సమయంలో “అసలు రూం కి వెళ్ళే టైమే ఉండట్లేదు. అందుకని నా గిటార్ రేపటి నించి ల్యాబుకే తెచ్చుకున్దామనుకుంటున్న” అని బాంబు పేల్చాడు. ల్యాబులో గిటార్ సేఫ్ కాదని వాడికి నచ్చచెప్పడానికి మా తాతలు దిగి వచ్చారు.

ఇక ఆఖరున మాత్రం అందరికీ భరింప శక్యం కాని ఒక ప్రక్రియని మొదలుపెట్టాడు. దేని అలజడికైతే హీరోయిన్ల మిడ్డీలు జారిపోతాయో, ఏదైతే ఆంధ్రా సోడా బుడ్డో, అది (విజిలు) వేయడం మొదలెట్టాడు. ఈ టార్చర్ ధాటికి అందరి చెవుల్లోనూ నిజంగానే సోడా బుడ్లు పగిలినంత పని అయ్యింది. వాడు వేసే విజిలుకీ అక్కడ వచ్చే పాటకీ సంబంధం ఏమిటో అర్ధం కాక కొంత; విజిలునో, పాటనో లేక కనీసం ప్రాజెక్ట్ నో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేసి మరో కొంత సహనం కోల్పోయారు అక్కడి అమాయకపు ప్రజలు. వీడి దగ్గర ఇంకెన్ని లలిత కళలు ఉన్నాయోనని జనాలకి భయం పట్టుకుంది.

తట్టుకోలేని ల్యాబు వాసులంతా ఈ ప్రక్రుతి వైపరీత్యాన్నించి తమని తాము రక్షించుకునేందుకు ఒక అత్యవసర సమావేశానికి పిలుపు ఇచి పుచ్చుకున్నారు. ఊరోడి తన్మయత్వం నించి తప్పించుకునే మార్గం అన్వేషించడం ఆ సమావేశం యొక్క ఏకైక ఉద్దేశం. అది (ఇంజమామ్ మ్యాచీ ఐపోయాక ప్రెజెంటేషన్ లో ఇంగ్లీష్ లో మాట్లాడినట్లుగా) ఇలా మొదలయ్యింది:

వాసు (వీడికి తెలుగు రాదు): హోరేయ్! హరి గాడు విశిల్ భలే కోట్ తాట్ (కొడతాడు – అని వాడి ఉద్దేశం) కదరా? అంత సేపు ఆపకుండా కొడ్తూ కూడ ఎం చదువుతున్నాడు రా వాడు?
బాబాయి: ఆ తొక్కలో ల్యాపుటాపుకే వాడికంత ఉంటే నా HP ల్యాపుటాపు లో నేను ఇంగ్లీషు పాటలు పెడతా…
రెడ్డన్న: అసలు వాడికి ఇంగిత జ్ఞ్యానం లేదా? జనం ఏమనుకుంటారో అన్న కనీస మర్యాద కూడా లేదా? వాడి concentration వల్ల నా పని నాశనం ఔతోంది.
సతీష్: రెడ్డన్న వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ
ఔనన్నా! ల్యాబులో పాటలు పెట్టడం ఎంతైనా తప్పే”.
దాదా: ఊర్ సైకాలజీ ప్రకారం ఒక ఊరోడు మిగతా పిల్లలందరూ వాడిలాగే ఉంటారనుకుంటాడు. అందుకే ఊరోడు మనమందరం కూడా వాడిలాగే పాటలుండగా చదువుకోగలం అనుకుంటున్నాడు.

కల్లు: అయితే అసలు మనకి ఇబ్బంది కలుగుతోందన్న విషయమే వాడికి అర్ధం కావడం లేదు అంటావా?
దాదా: ఔను! వాడి కాన్ఫిడెన్సు అటువంటిది. వాడిలోని “అపరిచితుడు” వాడిని “కార్తిక్ కాలింగ్ కార్తీక్” లో లాగ మ్యానిపులేట్ చేయడానికి రోజూ వాడికి “ఇన్ సెప్షన్” చేస్తూ ఉంటాడు. అందుకే వాడికా కాన్ఫిడెన్సు. అందరూ వాడిలాగే కాన్సెంట్రేషన్ తో చదువుకోగలరని అనుకుంటున్నాడు. అంటూ ఎవరికీ తెలియని దాని గురించి తనదైన స్టైల్ లో సొల్లు వాగాడు.

ఇంతలో సాయి గాడు అందరినీ తనతో పాటు షాపింగుకు తీసుకెళ్ళడానికి పన్నిన కుట్రలో నించి ఒక ఐడియా ఉద్భవించింది. అందరూ రాత్రికి రాత్రి మల్లేశ్వరం (సాయిగాడితో పాటు) షాపింగుకు వెళ్లి పుట్టెడు “ear phones” కొనుక్కోచ్చారు. అందరూ తలోకటీ పెట్టుకుని ఊరోడికి కూడ ఒకటిచ్చారు. అందరూ ఈ విధంగా “ear phones” చెవిలో కుక్కుకుంటే కొంతలో కొంతైనా ఏకాగ్రత వస్తుందని అందరూ భావించారు. కాని ఊరోడి లలిత కళా ప్రదర్శన అంతటితో ఆగితేనా!? అదేదో వాడి పాటలకు గుర్తింపు గా తెచ్చి ఇచ్చారనుకుని మరీ రెచ్చిపోవడం మొదలెట్టాడు.

అర్ధ అణాకి పంతోమ్మిదోచ్చే ఆ తొక్కలో ల్యాపుటాపు ను ఎడా పెదా పిచ్చి కొట్టుడు కొడుతూ చిత్ర విచిత్రంగా దరువు వేయడం మొదలు పెట్టాడు. దానికి తోడు సోడా బుడ్లు ఎగస్ట్రా డెకరేషను. “ఒరేయి! అది ల్యాపుతాపు రా. దానికివ్వాల్సిన మర్యాద దానికివ్వరా!” అని ఎంత మొత్తుకున్నా వాడి ధోరణి వాడిదే…

ఇంక జనాలు దీని నించి తప్పించుకోవడం కన్నా శతద్రు (caption: వీడికంటే టాపర్ లేడు…) కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడమే సులువని భావించి, ఇంకా అక్కడుంటే వాళ్ళకు వచ్చేవి జర్నలు పేపర్ లు కాదు – ఈ పాటలతో కడుపు కదిలి టిశ్శూ పేపర్ లేనని గ్రహించి, ప్రత్యామ్నాయాలు వెతకడం ప్ర్రారంభించారు. సొంత ల్యాబులున్న వారు ల్యాబులకి వెళ్ళిపోయారు. లేనివాళ్ళు రూం లో ఇంటర్నెట్ లు పెట్టించుకుని మరీ పారిపోయారు. ల్యాపుటాపులు కొనుక్కుని మరీ పారిపోయారు. కాని అవేవీ లేని హైదర్, వాసు కలిసి మరో మహత్తరమైన ఐడియా ఆలోచించారు. ఈ వృత్తాంతాన్నంతా ఒక బ్లాగులో రాసి (మరీ హర్ట్ చేయకూడదని ఊరోడి పేరును “హరి” గా మార్చారు). ఆలస్యం చేయకుండా అది ఊరోడికి చూపించారు.

అంటా చదివిన ఊరోడు: “భలే ఉంది రా! ఇంతకీ ఈ “హరి” ఎవరు? మీ చిన్నప్పటి క్లాసుమేటా!?” అన్నాడు…

దెబ్బకి క్లాసు అంతా : “వీడి కాన్ఫిడెన్స్ ఏంట్రా?” అని తలలు పట్టుకున్నారు.

Advertisements